GST Collection: 2024 డిసెంబరులో రూ. 1.77లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు..! 3 d ago
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2024 డిసెంబరు నెలలో రూ.1.77లక్షల కోట్లు దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు అయ్యాయి. 2023 డిసెంబరు (రూ.1.65లక్షల కోట్లు)తో పోలిస్తే 7.3 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూపంలో రూ.32,836 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూపంలో రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.47,783 కోట్లు, సెస్ల రూపంలో రూ. 11,471కోట్లు వచ్చాయి. సమీక్షిస్తున్న నెలలో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లుగా నమోదైంది. దేశంలో వస్తువుల దిగుమతి పై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్ల మార్క్ పైన నమోదవ్వడం వరుసగా ఇది పదో నెల. కానీ, 2024 ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు, నవంబరు (రూ.1.82 లక్షల కోట్లు)తో పోలిస్తే డిసెంబర్ నెలలో వసూళ్ళు కాస్త తగ్గాయి.
2023 డిసెంబర్ 2024 డిసెంబర్ పోలిస్తే రాష్ట్రాల వారీగా రెవెన్యూ పనితీరు..
• అత్యధిక వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాలు: తమిళనాడు (11%) మరియు తెలంగాణ (10%)
• మధ్యస్థ వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాలు: మహారాష్ట్ర (9%), రాజస్థాన్ (8%), మరియు కర్ణాటక (7%).
• తక్కువ వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాలు: గుజరాత్ (4%), బీహార్ (2%), ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ (1%).
• ఆంధ్రప్రదేశ్ 6% మాత్రమే నమోదు అయ్యింది.